Nara Lokesh : చినబాబు క్యాడర్ కు మంచి కిక్కు ఇస్తున్నట్లుందిగా?
రెడ్ బుక్ నుంచి నిన్న మొన్నటి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక వరకూ నారా లోకేశ్ ఆదేశాలే పార్టీకి హైప్ తెచ్చాయని చెప్పాలి
తెలుగుదేశం పార్టీని మూడు రకాలుగా చూడాలి. ఒకటి ఎన్టీ రామారావు హయాంలో.. పార్టీ ఆవిర్భావం నుంచి 1995 వరకూ ఎన్టీఆర్ మాట వేదంగా ఉండేది. పార్టీ క్యాడర్ కు ఆయన మాటలు పూర్తి స్థాయిలో మత్తు నిచ్చేవి. ఆయన డైలాగులతో, హావభావాలతోనే ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి పార్టీ పెట్టి ఎనిమిది నెలల్లో అధికారంలోకి తెచ్చిన చరిత్రను గడించారు. అయితే తర్వాత ఆయన శకం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 1995 నుంచి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరించేవారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ మనసులో ఉన్నది గుర్తించలేకపోయేవారని, అధికారంలో లేనప్పుడు మాత్రం ఆయనకు కార్యకర్తలు గుర్తుకు వచ్చేవారని ఇప్పటికీ పార్టీలో నేతలు అంటుంటారు.
చంద్రబాబు సాఫ్ట్ కార్నర్...
1995 నుంచి 2024 వరకూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఆయన నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు నాయుడు స్వయం శక్తితో ఎదిగిన నేత. తన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఇప్పటి వరకూ లాక్కుని వచ్చారంటే ఆయన శ్రమ ఫలితమే. నందమూరి వారసులకు పార్టీ చిక్కి ఉంటే ఏమయి పోయి ఉండేదో తెలియదు కానీ, చంద్రబాబు చేతిలో పార్టీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లిందని అనేవారు ఇప్పటికీ సీనియర్ నేతలున్నారు. ప్రతి ఎన్నికకు తన వ్యూహాన్ని మారుస్తూ.. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత చంద్రబాబు నాయుడు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన సాఫ్ట్ కార్నర్ సీనియర్ నేతలకు నచ్చుతుందేమో కానీ యువనేతలకు, క్యాడర్ కు నచ్చదు.
రెడ్ బుక్ నుంచి పులివెందుల వరకూ...
ఇక పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం పార్టీలో, ప్రభుత్వంలో లోకేశ్ మాట చెల్లుబాటు అవుతుంది. యువగళం పాదయాత్రతో కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న చినబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు పరుస్తున్నారు. ముఖ్యంగా రెడ్ బుక్ నుంచి నిన్న మొన్నటి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక వరకూ లోకేశ్ ఆదేశాలే పార్టీకి హైప్ తెచ్చాయని చెప్పాలి. గత ప్రభుత్వంలో తాము అనుభవించిన ఆవేదనను చినబాబు తీర్చేస్తున్నారని క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాడు అధికారంలో ఉన్నప్పడు తమపై చెలరేగిన నేతలను అరెస్ట్ చేయించడంలో చినబాబు ఆదేశాల వల్లనే జరిగిందని బలంగా క్యాడర్ నమ్ముతుంది.
తగిన రీతిలో బదులివ్వడం...
అందుకు తగ్గట్లుగానే లోకేశ్ కూడా ఎక్కడకు వెళ్లినా క్యాడర్ తో మమేకమవుతున్నారు. గత ప్రభుత్వంలో తమ పార్టీ నేతలకు, క్యాడర్ కు అన్యాయం చేసిన వారిని వదలడం లేదు. వారు అధికారులు కావచ్చు. ప్రజాప్రతినిధులు కావచ్చు. కత్తికి .. కత్తి.. కేసుకు.. కేసు అన్న రీతిలో ఆయన బదులివ్వడం పసుపు పార్టీ క్యాడర్ లో మంచి హుషారును ఇస్తుంది. అంతేకాదు ఫుల్లు కిక్కుకూడా ఇస్తుంది. అందుకే చినబాబు లోకేశ్ క్యాడర్ గురించి చేసే ఏ ఆలోచనలోనూ వెనుకంజ వేయడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుతున్నప్పటికీ పార్టీ బాగోగులను, క్యాడర్ సంక్షేమాన్ని మాత్రం లోకేశ్ పట్టించుకుంటున్నారని సోషల్ మీడియాలో కూడా పెద్దయెత్తున ఆయనను ప్రశంసిస్తూ పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నారా లోకేశ్ ప్రత్యర్థులను తొక్కి నార తీస్తున్నాడన్న సంతోషం మాత్రం తెలుగు తమ్ముళ్లలో ఉంది.