Nara Lokesh : ఈ నెలలోనే లోకేశ్ కు కీలక పదవి.. అంతా సిద్ధమయిందా?

ఈ నెలలో మంత్రి నారా లోకేశ్ కు కీలక పదవి లభించనుంది. పార్టీ నేతల డిమాండ్ కు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది

Update: 2025-05-14 09:16 GMT

ఈ నెలలో మంత్రి నారా లోకేశ్ కు కీలక పదవి లభించనుంది. పార్టీ నేతల డిమాండ్ కు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ నెలలో టీడీపీ మహానాడు జరగనుంది. కడప జిల్లాలో నిర్వహించనున్న ఈ మహానాడులో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది. ఇప్పటి వరకూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ అంతకంటే కీలకమైన పదవిని చేపట్టబోతున్నారన్న టాక్ పార్టీలో వినపడుతుంది. కార్యకర్తలు కూడా నారా లోకేశ్ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటుండటంతో ఈ మేరకు లోకేశ్ కు కీలకమైన పదవి కట్టబెట్టే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే కొందరు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోయినా ఖచ్చితంగా అంగీకరిస్తారన్న నమ్మకంతో పసుపు పార్టీ నేతలున్నారు. ఈరోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేశ్ పదవి పై చర్చించనున్నారు.

పార్టీలో్నూ, ప్రభుత్వంలోనూ,
ఎవరు అవునన్నా.. కాదన్నా నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకం. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. నారా లోకేశ్ ఈ తరం నాయకుడు కావడంతో పాటు యూత్ కు కనెక్ట్ కావడంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ప్రయత్నంలో పార్టీ నేతలున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఇటు పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టలేకపోతున్నారు. చంద్రబాబు కూడా వీలయినంత వరకూ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు నియోజకవర్గాల్లోనూ ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతున్నప్పటికీ లోకేశ్ అయితే బాగుంటుందన్న సూచనలు బలంగా వినిపిస్తున్నాయి. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సీనియర్లకు మాత్రం సలహాలు, సూచనలు అందించేలా ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయనున్నారు.
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో...
అయితే మొన్నటి వరకూ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్లు బాగానే వినిపించాయి. అయితే ఆ సౌండ్ ను మాత్రం చంద్రబాబు సమర్థవంతంగా కొంత అణిచి వేయగలిగారు. కొందరు ఒక అడుగుముందుకు వేసి కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత చీవాట్లు కూడా తిన్నారు. అయితే పార్టీలో భవిష్యత్ అంతా లోకేశ్ దే ఉంటుందని భావించిన నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం అంటే కొన్నిఆటంకాలు ఉండవచ్చని, కానీ పార్టీ విషయంలో మాత్రం లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. నిత్యంకార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని చంద్రబాబు చెవిలో మరీ చెప్పే వారి సంఖ్య ఎక్కువవుతుంది.
పార్టీ పగ్గాలు...
మహానాడులో పార్టీ పగ్గాలు ఇక లోకేశ్ చేతికి అందేలా పదవిని రెడీ చేస్తున్నారట. ఇప్పటికే పార్టీ అంతా లోకేశ్ కనుసన్నల్లోనే నడుస్తుంది. అయితే అధికారికంగా దానికి ముద్ర పడాలంటే కీలకమైన పదవి అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో పాటు లోకేశ్ అయితేనే కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీలవుతారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తుంది. అందుకే కడప జిల్లాలో ఈ నెలలో జరిగే మహానాడులో లోకేశ్ కు కీలక పదవిని అప్పగించే యోచనలో చంద్రబాబు కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇక అధికారికంగా లోకేశ్ పార్టీలో మరింత కీలకంగా నిర్ణయాత్మక శక్తిగా చినబాబు మారనున్నారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈరోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News