చిరంజీవికి నారా లోకేష్ సపోర్ట్.. ఏమన్నారంటే?

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం

Update: 2023-08-10 02:06 GMT

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉంది. పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకుని.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక చిరంజీవి కామెంట్స్‌కు టీడీపీ నుండి కూడా బాగా సపోర్ట్ వస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చిరంజీవికి మద్దతు ఇచ్చారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలలో తనకు ఎక్కడా తప్పని అనిపించలేదని అన్నారు. తమకు వ్యతిరేకంగా సినిమాలు చేసినప్పుడు ఈ వైసీపీ నేతలకు విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

‘సినిమా పరిశ్రమపై కక్ష కట్టవద్దని చిరంజీవి అనడం తప్పా? సినిమా పరిశ్రమపై రాజకీయాలు చెయ్యొద్దన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి.. సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండన్నారు. ఇందులో తప్పేముందో వైసీపీ నేతలే చెప్పాలి. మరి చంద్రబాబుని, నన్ను, పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తూ కట్టు కథలతో సినిమాలు తీసిన రోజు ఈ వైసీపీ నేతలకు విలువలు గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.
ఇక చిరంజీవి వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ముందుకు వచ్చింది. చిరంజీవి అన్న మాటల్లో తప్పేముందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఆయన చిరంజీవిని సమర్థించారు.


Tags:    

Similar News