TDP : లోకేశ్ కు సన్నిహితుడికే ఆ ఛాన్స్.. తేల్చేయనున్న అధిష్టానం

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేతులు కాలాక ఆకులు పట్టినట్లుగా నిర్ణయాలు తీసుకోనుంది

Update: 2025-10-09 08:13 GMT

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేతులు కాలాక ఆకులు పట్టినట్లుగా నిర్ణయాలు తీసుకోనుంది. తంబళ్లపల్లె నకిలీ మద్యం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం తంబళ్లపల్లెకు టీడీపీ ఇన్ ఛార్జి లేరు. అయితే వెంటనే తంబళ్లపల్లికి ఇన్ ఛార్జిని నియమించాలని టీడీపీ హైకమాండ్ సిద్ధమయింది. జయచంద్రారెడ్డి నియామకంతో పాటు ఆయనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం కూడా టీడీపీ నాయకత్వానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తలనొప్పులు తయారయ్యాయి. ఆ నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడాన్నిస్వాగతిస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో తమ గోడును హైకమాండ్ పట్టించుకోలేదని కూడా వారు చెబుతున్నారు.

నారా లోకేశ్ జోక్యంతో...
ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజవర్గ టీడీపీ ఇన్ ఛార్జి విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీ ముఖ్యనేతలతో ఆయన మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఎదురొడ్డి నిలిచే నేతను ఎంపిక చేసే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పేరు వినిపిస్తుంది. టీడీపీలోఉండి పెద్దిరెడ్డి ఫ్యామిలీ కోవర్టులుగా పని చేసే వారికి చెక్ పెట్టాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామ్ చినబాబు బీసీ నాయకుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేసే అవకాశముందని అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయాలంటే సమర్థుడైన, నమ్మకమైన నేతను తంబళ్లపల్లె టీడీపీ ఇన్ ఛార్జిగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
మదనపల్లె టిక్కెట్ ను ఆశించి...
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరును కూడా నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో యువకుడు, అందరికీ సుపరిచితుడైన శ్రీరామ్ చినబాబు పేరు తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్ ఛార్జిగా త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. శ్రీరామ్ చినబాబు గత ఎన్నికల్లో మదనపల్లె శాసనసభ టిక్కెట్ ఆశించి విఫలమయ్యారు. అక్కడ మైనారిటీ కోటాలో షాజ్ హాన్ భాషాకు ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం చినబాబు పనిచేశారు. టిక్కెట్ దక్కకపోయినా పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన శ్రీరామ్ చినబాబుకు అవకాశం ఇవ్వాలన్నది లోకేశ్ అభిప్రాయంగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో విభేదించకపోవచ్చంటున్నారు. రేపో, మాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్నసమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News