ఢీ అంటే ఢీ అనే వాళ్లను నేను గుర్తిస్తా: లోకేష్

సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన పాలనలో

Update: 2023-06-08 10:49 GMT

సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన పాలనలో రాష్ట్రంలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ బాధితులే అంటూ లోకేష్‌ కామెంట్ చేశారు. ఇవాళ పులివెందుల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేష్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో గెలవకపోయినా, అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులను డెవలప్‌ చేశామని, ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. పులివెందులకు నీరు ఇచ్చింది కూడా టీడీపీనే అన్నారు.

తమ పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని, 2019లో 90 వేల మెజారిటీతో గెలిచిన వైఎస్‌ జగన్‌ పులివెందులకు ఏం చేశారని నారా లోకేష్‌ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ జయంతి, వర్ధంతికి రావడం తప్ప సీఎం జగన్‌ ఈ నియోజకవర్గానికి చేసిందేంటన్నారు. ఇక్కడ ఎలాంటి వెల్ఫేర్‌, డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు జరగడం లేదన్నారు. 'నాడు - నేడు' పేరుతో చేసింది హడావుడి తప్ప అభివృద్ధి లేదన్నారు. పులివెందుల పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌.. ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదని నారా లోకేష్‌ విమర్శించారు. పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో వేయాల్సిన రోడ్లు కూడా పూర్తి చేయలేదని, కనీసం ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరు అందించలేదని నారా లోకేష్‌ అన్నారు.

పార్టీలోని సీనియర్లను, జూనియర్లను సమానంగా గౌరవిస్తామన్న లోకేష్‌.. పని చేసే వారికే పదవులు ఇస్తామన్నారు. బూత్‌ స్థాయిలో మెజార్టీ వస్తేనే పదువులు ఇస్తామని చెప్పారు. నాయకులు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, కేసులకు భయపడి ఇంట్లో ప్రజలు హర్షించరని అన్నారు. తాము గ్రూప్‌ రాజకీయాలని ప్రోత్సహించమన్నారు. భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని నారా లోకేష్‌ సూచించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో టీడీపీకి మంచి ఆదరణ ఉందని, దానిని జిల్లా నాయకత్వం అందిపుచ్చుకోవాలన్నారు. ఓడిపోయినా పెత్తనం చేయాలనుకుంటే కుదరదన్నారు. ఢీ అంటే ఢీ అనే వాళ్లను తాను గుర్తిస్తానని అన్నారు. త్వరలో ఇంచార్జ్‌ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని నారా లోకేష్‌ తెలిపారు. 

Tags:    

Similar News