పవన్ కళ్యాణ్ ఆరోజు తీసుకున్న నిర్ణయం ఓ సంచలనం
టీడీపీ యువగళం విజయోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
pawan kalyan decision about joining hands with chandrababu naidu
టీడీపీ యువగళం విజయోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని.. రాష్ట్రం బాగుండాలనే దిశగా పవన్ అడుగులు వేశారని అన్నారు. రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశాక పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమని అన్నారు. జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం ఏర్పడనుందని నాదెండ్ల ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అనేక వేధింపులకు, అవమానాలకు గురయ్యామని, మంచి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీలను అణగదొక్కాలని అనేక రకాలుగా వైసీపీ ప్రయత్నించిందని.. చంద్రబాబు తన అనుభవంతో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారన్నారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారన్నారు నాదెండ్ల మనోహర్. 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారని.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారన్నారు. రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డి పాలనలతో జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారన్నారు.