YSRCP : ముద్రగడకు జగన్ ఇచ్చే బంపర్ ఆఫర్ ఇదేనా? అదే జరిగితే?
వైసీపీలో పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభానికి జగన్ పెద్దబాధ్యతలను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి
వైసీపీలో పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభానికి జగన్ పెద్దబాధ్యతలను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న కాలంలో ఆయనకు పార్టీలో కీలకమైన పదవి ఇస్తారని అంటున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ముద్రగడకు కీలక పదవి ఇవ్వాలని జగన్ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లు ఇబ్బందిపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కిర్లంపూడిలోని ఆయన సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు మూడు నెలల్లో ఆయన యాక్టివ్ అయినవెంటనే ముద్రగడకు కీలక బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు.
ఆ రెండు జిల్లాలపై పట్టుకు...
ఇప్పటికే శాసనమండలిలో విపక్ష నేతగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. ఆయన కూడా కాపు సామాజికవర్గమే.అయితే ఆయన ఉత్తరాంధ్ర జిల్లా నేతగానే గుర్తిస్తారు. ప్రధానంగా ఎక్కువ స్థానాలున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపై బొత్స సత్యనారాయణకు పట్టు లేదు. దీంతో ముద్రగడకు ముఖ్యమైన పదవిని అప్పగించి ఆ రెండు జిల్లాల్లో పర్యటించేలా జగన్ వర్క్ అవుట్ చేస్తున్నారని సమాచారం. రెండు జిల్లాల్లోని అన్ని నియోజకర్గాలను ముద్రగడ తిరగడమే కాకుండా ఇటీవల జరిగిన పరిణామాలను కూడా వివరించేందుకు ముద్రగడను ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ముద్రగడ తో కొంత ఈ రెండు జిల్లాల్లో పార్టీకి హైప్ వస్తుందని భావిస్తున్నారు.
కాపు సామాజికవర్గంలో అసంతృప్తిని...
ఇటీవల అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో పాటు.. తర్వాత చిరంజీవి చేసిన ప్రకటన కూడా కాపు సామాజికవర్గంలోకి బలంగా వెళ్లింది. కాపు సామాజికవర్గంలో అత్యధిక మంది నందమూరి బాలకృష్ణ మీదనే అసంతృప్తిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది కూటమిపై పడుుతుందా? ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై దాని ప్రభావం ఉంటుందన్న అభిప్రాయంతో వైసీపీ ఉంది. చంద్రబాబు నాయుడు సభలో ఉండి చిరంజీవి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించకపోవడం, పవన్ కల్యాణ్ కూడా చిరుపై చేసిన వ్యాఖ్యలపై రెస్పాండ్ కాకపోవడంతో ఉన్న అసంతృప్తిని ముద్రగడ ద్వారా క్యాష్ చేసుకోవాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. మరి జగన్ ఆ రెండు జిల్లాలకు సంబంధించి ఎలాంటి పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముద్రగడను ఇప్పటికే పీఏసీ మెంబర్ గా ఉన్నారు. త్వరలోనే కీలక పదవి ఆయన దరి చేరబోతుందన్న వార్తలు అందుతున్నాయి.