Montha Cyclone : "మొంథా" తీవ్రత మొదలయింది.. ఒక్కసారిగా వాతావరణం
మొంథా తుపాను తీవ్రత కోస్తా జిల్లాల ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరో నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగానే ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి
మొంథా తుపాను తీవ్రత కోస్తా జిల్లాల ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరో నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగానే ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా మారింది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కాకినాడ వద్ద దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ రోజు ఉదయం 5:30 గంటల సమయానికి, ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా గంటకు 15 కి.మీ. వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మాచిలీపట్నానికి ఆగ్నేయంగా 190 కి.మీ., కాకినాడకు 270 కి.మీ., విశాఖపట్నానికి 340 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.
30వ తేదీ వరకూ...
తుఫాను ప్రభావంతో అక్టోబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 28న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు...
భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ రేపు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. తీరం వెంట గంటకు 60-70 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండగా, ఈ రోజు సాయంత్రం నుంచి అక్టోబర్ 29 తెల్లవారుజాము వరకు 90 నుంచి100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 29 మధ్యాహ్నం నాటికి ఈ వేగం క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంగవరం, కాకినాడ ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.