Andhra Pradesh Politics : కర్నూలులో మోదీ జగన్ పై నిప్పులు చెరుగుతారా? విమర్శలకు చెక్ పెడతారా?
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అయితే రాయలసీమ కావడంతో ప్రధాని పర్యటనలో జగన్ పై విమర్శలు చేసే అవకాశముందని తెలిసింది. రాయలసీమ ప్రాంతంలో జగన్ అనుసరించిన విధానాలను ప్రధాని మోదీ ద్వారా ఎండగట్టేలా చేయాలని కూటమి పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ మోదీ ఆంధ్రప్రదేశ్ కు ఎన్నిసార్లు పర్యటనకు వచ్చినప్పటికీ నేరుగా జగన్ ను విమర్శించలేదు. ఇది కూటమి పార్టీ నేతల్లోనూ, మూడు పార్టీల క్యాడర్ లోనూ కొంత అసంతృప్తి ఉంది. అయితే కర్నూలు జిల్లా పర్యటనతో దీనికి తెరదించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎంతగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో జరిగిన అవకతవకలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూటమి నేతల్లో వ్యక్తమవుతుంది.
ఈ నెల 16వ తేదీన...
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ముందుగా శ్రీశైలం చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగే బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. వాస్తవానికి నరేంద్ర మోదీ జీఎస్టీ 2.0 సంస్కరణలనున ప్రజల్లోకి తీసుకెళుతున్నప్పటికీ ఈ సభద్వారా జగన్ పై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు చేస్తే అందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీలకు అవసరమైన ఆక్సిజన్ మరింతగా దొరుకుతుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా హస్తిన స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఇప్పటికే పలు మార్లు పర్యటించినా...
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు పర్యటించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే విశాఖలో జరిగిన మెగా యోగా డేలోనూ పాల్గొన్నారు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ ప్రధాని మోదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కూటమి పార్టీ నేతలు కూడా ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈసారి కర్నూలు జిల్లా పర్యటనలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పై విమర్శలు చేయడం ఖాయమని అంటున్నారు. అప్పుడే కూటమి మిత్ర ధర్మం పాటించినట్లవుతుందని, జగన్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారన్న అభిప్రాయం కూడా తొలిగిపోతుందని భావిస్తున్నారు. మరి నరేంద్ర మోదీ ప్రసగంలో జగన్ పై విమర్శలు ఉంటాయన్న టాక్ మాత్రం కూటమి పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. జగన్ రాజకీయంగా స్పీడ్ పెంచడంతో కర్నూలులో ఖచ్చితంగా జగన్ పై విమర్శలు ప్రధాని చేస్తారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.