Narendra Modi : జగన్ ప్రస్తావనే లేదు.. అదే కారణమా?
ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు
ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. వచ్చిన నాలుగు సార్లు కూడా జగన్ సర్కార్ ను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కూటమి పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా వచ్చారు. అప్పుడు అది సరైన వేదిక కాదు. ఇక రెండో సారి రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి మోదీ మరలా అమరావతికి వచ్చారు. ఈ సభ మాత్రం రాజకీయ సభ. అయితే ఆ వేదిక పై నుంచి కూడా జగన్ ప్రస్తావన లేకుండానే నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం యోగా డే సందర్భంగా విశాఖకు వచ్చిన సందర్భంలోనూ మోదీ విమర్శలకు దూరంగా ఉన్నారు.
కర్నూలు సభలో...
అయితే ఈరోజు జరిగిన కర్నూలు సభ మాత్రం జీఎస్టీ సంస్కరణల సందర్భంగా ఏర్పాటు చేసిన సభ అయినప్పటికీ లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అందులోనూ రాయలసీమలో జరుగుతుంది. ఈ సభలోనూ నరేంద్ర మోదీ జగన్ సర్కార్ గురించి ప్రస్తావన తేలేదు. దేశంలో పదేళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై విమర్శలు చేసిన నరేంద్ర మోదీ పదహారు నెలల క్రితం వరకూ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని సభకు వచ్చిన వారు కూడా చర్చించుకున్నారు. ఈ సభలో ఖచ్చితంగా మోదీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అందరూ భావించారు. రాష్ట్రంలోని కూటమి పార్టీలకు చెందిన నేతలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు.
వచ్చిన సందర్భం...
కానీ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పాలన ఏపీలో అసలు జరిగినట్లే గుర్తున్నట్లు వ్యవహరించారని టీడీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కానీ అదే సందర్భంలో నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై ప్రశంసలు కురిపించారు. అది కొంత వరకూ ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ తమ ప్రత్యర్థి జగన్ పాలనపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఒకింత టీడీపీ, జనసేన క్యాడర్ నిరాశకు గురయిందనే చెప్పాలి. కానీ ప్రధాని మోదీ కర్నూలుకు వచ్చింది అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు జీఎస్టీ సంస్కరణల గురించి వివరించడానికేనని, అందులో జగన్ ప్రస్తావన ఎందుకు వస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరొకసారి మోదీ నోటి నుంచి జగన్ పై విమర్శలు రాకపోవడంతో చాలా నిరాశకు తెలుగు తమ్ముళ్లు గురయ్యారు.