రవాణాశాఖ మంత్రిగా ఎవరొచ్చినా నా సహకారం ఉంటుంది : పేర్ని నాని

రవాణాశాఖ మంత్రిగా ఎవరు వచ్చినా వారితో తన అభిప్రాయాలను పంచుకుంటానని తెలిపారు. మూడేళ్లపాటు మీతో కలిసి..

Update: 2022-04-05 05:27 GMT

విజయవాడ : త్వరలోనే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ పునర్వ్యవస్థీకరణతో ఎవరెవరు పదవులు వదులుకుంటారు ? ఎవరిని మంత్రి పదవులు వరించనున్నాయన్న విషయంపై కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈనెల 11వ తేదీ నుంచి కొత్తమంత్రివర్గం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రవాణాశాఖ మంత్రిగా ఎవరు వచ్చినా వారితో తన అభిప్రాయాలను పంచుకుంటానని తెలిపారు. మూడేళ్లపాటు మీతో కలిసి పనిచేశాను.. ఇకపై ఏ సమస్యలు ఉన్నా కొత్తమంత్రి వద్దకు, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు రవాణాశాఖ కేటాయించినప్పుడు దేవుడిని, సీఎం జగన్‌ను తిట్టుకున్నానని అన్నారు. తనను మంత్రిగా నియమించినపుడు.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిగా కృష్ణబాబు, కమిషనర్‌గా సీతారామాంజనేయులు, ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు ఉన్నారని, వీరు ముగ్గురు ఎవరి మాటా వినరని తెలిసే అలా తిట్టుకున్నానని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ముగ్గురూ ఎప్పుడూ తనతో అలా వ్యవహరించలేదని, తాను ఏది చెప్పినా ఎంతో పాజిటివ్‌గా తీసుకునేవారని అన్నారు.


Tags:    

Similar News