రేపు నెల్లూరుకు మంత్రి పార్థివదేహం.. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు

గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుండి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు హెలికాప్టర్..

Update: 2022-02-21 13:29 GMT

ఏపీ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రులు, ఇతర తెలంగాణ మంత్రులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు గౌతమ్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి తనయుడు అర్జున్ అమెరికాలో ఉండగా.. అతను వచ్చాక అంత్య క్రియలు నిర్వహించనున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుండి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు హెలికాప్టర్ ద్వారా తరలిస్తారు. అక్కడ నుంచి డైకస్ రోడ్డు లోని మంత్రి నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. తిరిగి బుధవారం ఉదయం నెల్లూరు నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలోని మేకపాటి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి కి పార్థివ దేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరుకానున్న నేపథ్యంలో బ్రాహ్మణపల్లి సమీపంలోని కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్ పి విజయ రావు, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఆత్మకూరు ఆర్డిఓ చైత్ర వర్షిణి హెలిప్యాడ్ ను పరిశీలించారు.


Tags:    

Similar News