Weather Report : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. ఈసారి వాయుగుండమేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది
బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఈ నెల 26వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టంబరు 26వ తేదీన వెలువడే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందనికూడకా తెలిపింది. వాయుగుండం ఏర్పడితే వర్షాలు భారీగా పడతాయని, అధికారులు అప్రత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది.
పిడుగులు పడే అవకాశం...
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే కో్స్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షి కోస్తాంధ్ర, రాయల సీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకూ సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా వాగులు, నదులు దాటే ప్రయత్నాన్ని ఎవరూ చేయవద్దని, ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణలో కూడా ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడి, వాయుగుండంగా మారితే మరో నాలుగు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడి వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. ఈ సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలాగే క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని సూచించింది. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప హైదరాబాద్ వాసులు సాయంత్రం వేళ బయటకు రావద్దని సూచించింది.