Rain Alert : వదలని వర్షం .. కుండపోత తప్పదట.. అలెర్ట్ గా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. వాయుగుండంగా మారి ఈ రోజు దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అనేక చోట్ల ఇరవై ఐదు సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రజలు వాగులు వంకలు దాటవద్దని, అది ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్...
అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరింది. పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతి పురం మన్యం జిల్లాలో ఆరెజ్ అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, కడపలో ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ తెలిపింది. విద్యుత్తు స్థంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు...
అలాగే తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కామారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్సాలు పడతాయని తెలిపింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని కూడా పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ఇంటిపట్టునే ఉండటం క్షేమకరమని వాతావరణ కేంద్రం తెలిపింది