Rain Alert : నాలుగురోజులు కుండపోత వర్షాలు తప్పవు.. ఏ ఏ జల్లాల్లో అంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాగల నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచిఅతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల యంత్రాంగాన్ని సూచించింది.
ఈ జిల్లాల్లో నేడు వర్షాలు...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఉరుములుతో మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని, రైతులు, పశువుల కాపర్లు పొలాల్లోకి వెళ్లిన సమయంలో చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది.
తెలంగాణలోనూ...
అయితే తెలంగాణాలోనూ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. వడగళ్ల వాన పడుతుందని, అదే సమయంలో పిడుగులు కొన్ని చోట్ల పడతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని చోట్ల కుండ పోత వాన కురిసే అవకాశముందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.