Rain Aleret : నేడు కూడా భారీ వర్షాలు.. రెండు రాష్ట్రాలకు హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో బంగాళాఖాతంలో వరసగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయని ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతాయని పేర్కొంది. రాబోయే రెండు వారాలు వర్ఫపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం చెప్పింది. ఈరోజు నుంచి భారీవర్షాలు నమోదయ్యే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని తెలిపింది. ఈమేరకు భారత వాతావరణ శాఖ తెలపడంతో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు.
మరో రెండు రోజులపాటు...
తెలంగాణలోనూ మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరన శాఖ తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఎక్కువగా సాయంత్రం వేళల్లోనే కుండపోత వర్షం కురిసే అవకాశముందని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ముంచెత్తిన వర్షంతో నగరం మొత్తం జలమయమయింది. ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సిద్ధిపేట్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈదురుగాలులతో కూడిన...
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు కూడా పడతాయని, పశువులు కాపర్లు, రైతులు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రధానంగా ప్రకాశం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.