Raina Alert : నేడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ రుతుపవన ద్రోణి కొనసాగుతున్నందున దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో ఈ జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో రుతుపవన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రధానంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది.
తెలంగాణలో నేడు...
తెలంగాణలోనూ నేడు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మరొకవైపు ఇటు ఏపీ అటు తెలంగాణ ప్రాజెక్టుల్లో నీరు నిండుతుందని, గోదావరిలో వరద నీరు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.