Cyclone Alert : ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఈ ప్రాంతాల్లో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెయిన్ అలెర్ట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఒకవైపు అల్పపీడనం ప్రభావంతో పాటు మరొకవైపు రుతుపవనాలు రాకతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాగులు దాటేటప్పుడు జాగ్రత్త...
నదులు, వాగులు, చెరువులు ఉప్పొంగుతాయని, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని కూడా వాతావరణ శాఖతో పాటు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా సూచించింది. ఆ యా ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. సాయం కోసం అత్యవసర నెంబర్లను కూడా ఏర్పాటు చేసి వాటిని ప్రజల్లో బలంగా పంపగలిగేలా ప్రసార మాధ్యమాల ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలో ఈ ప్రాంతంలో...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకూ విస్తరించాయిఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని సూచించింది. ఈ నెల 31 వతేదీ వరకూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది.