Weather Report : ఈరోజు రాత్రికి తీరం దాటనున్న వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పదికిలోమీటర్ల వేగంతో కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం విశాఖపట్నానికి 300 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశాలోని గోపాల్‌పూర్ కి 300 కిలోమీటర్లు ,పారాదీప్ కి 400 కిలోమీటర్ల దూరలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమయింది.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం...
ఈరోజు రాత్రికి గోపాల్‌పూర్- పారాదీప్ మధ్య ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.