Weather Report : భారీ వర్షాలు తప్పవట..వాగులు, వంకలు దాటే సమయంలో జాగ్రత్త
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పాటు వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
అతి భారీ వర్షాలు...
ఆంధప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. విశాఖ, అల్లూరు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించింది. లోతుగా ఉండే ప్రదేశాలుంటాయని, అందుకే వాగులు, వంకలు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, వాగులు దాటకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరొకవైపు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఎల్లో అలెర్ట్ జారీ చేసి...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమ్రుంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.