Rain Alert : వాయుగుండం.. తీవ్ర వాయుగుండం...మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడతో దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుందని, తర్వాత ఈరోజు రాత్రికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాల మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తీరప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో చేపట వేటకు నాలుగు రోజుల పాటు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో నాలుగు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, యానం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పోర్టులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు గోదావరికి వరద నీరు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, నదుల్లో ఈతకు వెళ్లవద్దని సూచించింది.
పిడుగులు పడే అవకాశం...
తెలంగాణలోనూ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దాని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పశువుల కాపర్లు, రైతులు పొలాలకు వెళితే చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో నదుల్లో స్నానాలకు దిగే ప్రయత్నం చేయవద్దని కూడా అధికారులు హెచ్చరించారు.