Rain Alert : నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరో నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు మరికొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా హెచ్చరించింది.
భారీ వర్షాలు పడే అవకాశం...
అదే సమయంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని, కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడతాయని, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు...
ఇక తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు భారీవర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందని కూడా చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల,కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పందొమ్మిది జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.