Rain Alert : వానలు ఇంకా ఉన్నాయ్.. మరో అల్పపీడనం ఎప్పుడంటే?
మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరొక అల్పపీడనం రెడీ గా ఉంది. వచ్చే నెల ఒకటో తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇక వానలు మరికొద్ది రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్నిచోట్ల, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. బలంగా ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంతంలో సముద్రం అలజడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఏపీలో రెండు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానగా బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతుందని, ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం బ్యారేజి ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.02 లక్షల క్యూసెక్కులుగా ఉందని, ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. దుర్గమ్మ శరన్నవరాత్రులకు విజయవాడ వచ్చే భక్తులు జల్లు స్నానాలు మాత్రమే ఆచరించాలని, నదిలోకి దిగవద్దని తెలిపింది.
గోదావరి నదికి వరద ఉధృతి...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగిందని, భద్రాచలం వద్ద ప్రస్తుతం 42.4 అడుగుల నీటిమట్టంగా ఉందని తెలిపింది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కృష్ణా, గోదావరి నదిపరీవాహక ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది.