Weather Report : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నాలుగు రోజులు హై అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు రుతుపవనాలు కూడా ఏపీలో ప్రవేశించే సమయం దగ్గరపడుతున్నందున ఇక వాతావరణం కూల్ కూల్ గా ఉంటుందని అన్నారు. 27వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడే అవకాశముందని కూడా తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపింది. దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. రాయలసీమ ప్రాంతంలో నేడు తేలికపాటి నుంచి వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది.
మరో నాలుగు రోజులు...
తెలంగాణలోనూ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్,ఆదిలాబాద్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక సిద్ధిపేట, జనగాం, హనమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కావున హోర్డింగ్ లు, చెట్ల వద్ద ఎవరూ గుమి కూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.