Weather Report : ఎండవేడిమి తగ్గినట్లే.. ఈ సమ్మర్ ఇక కూల్ కూల్ గానే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, నంద్ాయల, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
ఉష్ణోగ్రతలు తగ్గుతాయంటూ...
భారీ వర్షాలు కొన్ని జిల్లాలు మాత్రమే పడతాయని, మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలకంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. రాత్రి వేళ కొంత అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం భారీ వర్షం కురుస్తున్నా సురక్షిత ప్రాంతాలకు తరలి వచ్చేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సూచించారు.
పదకొండు జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలో నేడు కూడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటి వేళ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని కూడా తెలిపింది. పగటి పూట నలభై డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావని వాతావరణ శాఖ తెలిపింది. వేడిగాలుల తీవ్రత కూడా తక్కువగా ఉంటుందని చెప్పింది. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. వడగండ్ల వర్షం కొన్ని చోట్ల పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. పదకొండు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.