Rain Alert : ఈరోజు కూడా కుండపోత తప్పదు.. ప్రయాణాలు రద్దు చేసుకోండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-08-29 03:43 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఇంకొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఈరోజు మెదక్, కామారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జెఎన్టీయూ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు.

భారీగా ఆస్తి నష్టం...
భారీ వర్షాలకు తెలంగాణలో తీవ్రంగా నష్టం జరిగింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాధమిక అంచనాలను రూపొందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడటంతో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, వరంతల్, సిద్ధిపేట్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, ములుగు, మహబూబాబాద్ ఖమ్మం, కామారెడ్డి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. అలాగే కాల్వలు, వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలని పేర్కొంది.


Tags:    

Similar News