Rain Alert : పొంచి ఉన్న వాయుగండం ముప్పు.. వాన దెబ్బకు వామ్మో అనాల్సిందే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-09-25 04:48 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా శుక్రవారం నాటికి మారనుందని తెలిపింది. ఈ నెల 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశముందని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరొకవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలలు భారీగా ఎగిసి పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో బలమైన ఈదురుగాలులతో కూడిన...
ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు వాయుగుండం ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే తీరంవెంట బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈరోజు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఈ నెల 26వ తేదీన పల్నాడు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రమాదకరంగా వాగులు, నదులు ప్రవహిస్తున్నాయని ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపింది.
పద్దెనిమిది జిల్లాల్లో ఎల్లో అలెర్ట్....
తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, తెలంగాణలోని పద్దెనమిది జిల్లాలకు భారీ వర్ష సూచనను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, ఇరవై ఒక్క జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Tags:    

Similar News