Rain Alert : మరో అల్పపీడనం.. వాయుగుండం.. తప్పని వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరి కొద్ది రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరి కొద్ది రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎల్లుండి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. అక్టోబరు 3వ తేదీన పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో విస్తారంగా వర్షాలు పడటమే కాకుండా, బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది.నాలుగు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచిచంింది.
మరికొన్ని రోజులు ఏపీలో...
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. తీరం వెంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయని, అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలో ఈ ప్రాంతంలో...
తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈరోజు సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి నదికి వరద ఉధృతి తీవ్రంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.