Rain Alert : నాలుగు రోజులు వర్షాలే.. అన్నదాతలకు తీపికబురు
రానున్న కొద్ది గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలుపడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది
రానున్న కొద్ది గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలుపడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పింది.
నాలుగు రోజుల పాటు
తెలంగాణలోనూ నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. నిజామాబద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రైతులకు మేలు...
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాతీరంలో సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఈ ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధం కావడంతో ఇప్పుడు కురిసే వర్షాలు మేలుచేస్తాయని అన్నదాతలకు తీపి కబురు అందించింది.