Rain Alert : అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడతాయంటే?

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది

Update: 2025-07-01 04:00 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం చెప్పింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది.

ఉరుములు మెరుపులతో కూడిన...
ఏపీ, తెలంగాణలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, పర్జలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో చెదరుమదురుగా జల్లులు పడే అవకాశముందని తెలిపింది. ఈదురుగాలులు బలంగా వీచే అవకాశమున్నందున ప్రజలు హోర్డింగ్ లు, చెట్ల కింద, విద్యుత్తు స్థంభాల వద్ద నిల్చోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.
అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, నిజామాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.




Tags:    

Similar News