Ys Jagan : జగన్ స్టాండ్ మార్చుకుంటేనే...సరి లేకుంటే.. మళ్లీ అదే గతి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పడిన ముద్రను చెరిపేసుకోవాల్సి ఉంది. ఒకేసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు

Update: 2025-08-18 07:56 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పడిన ముద్రను చెరిపేసుకోవాల్సి ఉంది. ఒకేసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో నెంబర్ వన్ గా నిలిచిన జగన్ డెవలెప్ మెంట్ విషయంలో మాత్రం వెనకపడ్డారనే చెప్పాలి. పోర్టులు, మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసినప్పటికీ ఆయనకు అభివృద్ధికి సంబంధించి మాత్రం బ్యాక్ బెంచ్ కే పరిమితమయ్యారు. ఆ ముద్రను మాత్రం చెరపేసుకోవాలని వైసీపీ కార్యకర్తలే కోరుతున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక సంస్థలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి పెట్టడంలో ముందుండేలా ఎన్నికల హామీలను అమలు చేయాలని కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు.

సంక్షేమంతో పాటు...
తన ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను కూడా అనుసరిస్తానని చెప్పగలగాలి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. అదే పంథాను జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో అనుసరించి, ప్రజలకు వివరించగలిగితేనే ప్రజలు కూడా విశ్వసించే అవకాశముందని కార్యకర్తలు గట్టిగా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో హామీల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో అలాగే అభివృద్ధికి సంబంధించిన హామీలను కూడా జనం ముందుంచడంలో జగన్ ముందుండాలని క్యాడర్ కోరుకుంటుంది.
రాజధాని అమరావతి విషయంలో...
ఒకరకంగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ మనసులో మరో అభిప్రాయానికి తావులేదు. అదే సమయంలో రాజధాని అమరావతి విషయంలోనూ అదే స్టాండ్ ను బయటపెట్టగలగాలి. తాను అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతుందని చెప్పాలి. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. గతంలో మూడు రాజధానులంటూ చేసిన ప్రతిపాదనను మూడు ప్రాంతాల వారు విశ్వసించలేదనడానికి గత ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లోనూ దానిపై ఏమీ మాట్లాడకోకుండా తప్పించుకోవాలని చూస్తే ముఖ్యంగా మధ్య, ఎగువ మధ్య తరగతి, కోస్తాంధ్ర ప్రజల నుంచి జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న హెచ్చరికలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మరి జగన్ తన వాదనకే కట్టుబడి ఉంటారా? లేదా? అన్నది ఆయనకే వదిలేయాల్సి ఉంది.


Tags:    

Similar News