Ys Jagan : మార్గాని భరత్ విషయంలో జగన్ ఆలోచన మార్చుకున్నారా?

మార్గాని భరత్ కు ఈసారి టిక్కెట్ కేటాయింపుపై వైసీపీలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది

Update: 2025-12-06 07:19 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేవలం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మాత్రమే కాదు. పార్లమెంటు అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించనున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. పార్లమెంటు స్థానాలు ఎన్ని ఎక్కువగా గెలిస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలపైపడుతుంది. క్రాస్ ఓటింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అందుకే సామాజికపరంగా బలమైన అభ్యర్థులను ఈసారి ఎంపిక చేసి మరీ బరిలోకి దించాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారని తెలిసింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి...
గతంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా మొదటిసారి రాజమండ్రి పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని ప్రకటించారు. మార్గాని భరత్ ను పోటీ చేయించారు. ఆయన గెలిచారు. దీనివల్ల తూర్పు గోదావరి జిల్లాలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం పడింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మార్గాని భరత్ ను రాజమండ్రి నగర నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే ఈసారి ఆ ఆలోచన మార్చుకున్నట్లు తెలిసింది.
అయితే అనుచరులు మాత్రం...
తిరిగి మార్గాని భరత్ ను రాజమండ్రి పార్లమెంటుకు పోటీ చేయించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది. భరత్ కూడా రాష్ట్ర రాజకీయాలకంటే దేశ రాజకీయాలకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనపడుతుంది. ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి మార్గాని భరత్ యాక్టివ్ గానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా అధికార పార్టీపై విమర్శలు చేయడంలో మార్గాని భరత్ ముందుంటున్నారు. అయితే మార్గాని భరత్ ను మళ్లీ రాజమండ్రి పట్టణ నియోజకవర్గానికే పోటీ చేయించాలని ఆయన అనుచరులు కోరుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల కొందరు సమావేశమై జగన్ ను కలసి తమ మనసులో మాటను చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి చివరకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.


Tags:    

Similar News