Magunta : మాగుంట ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్ అదేనా?
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మాగుంట కుటుంబానికి మంచి పట్టుంది
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మాగుంట కుటుంబానికి మంచి పట్టుంది. మాగుంట కుటుంబం నుంచి వరసగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయినప్పటికీ 2024 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలుపొందారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రకటనతో ఆయన వారసుడిని ఒంగోలు ప్రజలు ఎంతమాత్రం ఆదరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియజకవర్గం నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
చరిత్ర చూస్తే...
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం చరిత్ర చూస్తే టీడీపీ గెలిచింది మూడు సార్లు మాత్రమే. మొత్తం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి పద్దెనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మూడు సార్లు మాత్రమే. 1984లో టీడీపీ పార్టీ స్థాపించిన కొత్తలో బెజవాడ పాపిరెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. తర్వాత 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి కరణం బలరాం కృష్ణమూర్తి గెలిచారు. మూడో సారి 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలుపొందారు. అంటే టీడీపీ కంటే ఇక్కడ కాంగ్రెస్, వైసీపీలే ఎక్కువ సార్లు విజయం సాధించాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో టీడీపీకి అవకాశం తక్కువ సార్లు దక్కింది.
రాఘవరెడ్డి పోటీ చేస్తే...
ఇక మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన హత్య జరిగిన తర్వాత మాగుంట సతీమణి పార్వతమ్మ 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 1998, 2004, 2009లో వరసగా మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2024 లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే వచ్చే ఎన్నికలలో మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఇప్పుడు వైసీపీ నుంచి తిరిగి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వైవీని తట్టుకుని యువకుడు మాగుంట రాఘవరెడ్డి ఏమాత్రం నెగ్గుకొస్తారన్నది చూడాలి.