Ys Jagan : జగన్ లో ఛేంజ్.. ఇక ఛేజింగ్ మొదలుపెడతారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. క్యాడర్ ను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు

Update: 2025-06-02 06:29 GMT

వైసీపీ అధినేత జగన్ లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. కార్యకర్తల ఇంటికి నేరుగా వెళ్లడం చూస్తుంటే ఆయనలో వచ్చిన మార్పునకు నిదర్శనమనే చెప్పాలి. గత కొంత కాలంగా వైసీపీ అధినేత జగన్ తాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్ అంగీకరించారు. కేవలం వాలంటీర్ల మీద ఆధారపడటమే తాను చేసిన తప్పు అని కూడా అంతర్గత సమావేశాల్లో అంగీకరించారు. ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే తాను ప్రాధాన్యత ఇస్తానని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు.

ఐదేళ్ల పాటు మర్చిపోయన...
ఐదేళ్ల పాటు క్యాడర్ సంగతి మర్చిపోయిన జగన్ ఇప్పడు ఓటమి తర్వాత అసలు విషయం తెలిసి వచ్చింది. కార్యకర్తలు అలా తనంటే పడి ఉంటారులే అని భావించారు. తనపై ఉన్న క్రేజ్ చెక్కు చెదరదని నమ్మారు. కార్యకర్తల సంక్షేమాన్ని విస్మరించి ఎంత పెద్ద తప్పు చేశానన్నది జగన్ కు అర్థమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం నిలబడి, జెండాను వదలిపెట్టకుండా నిలబడే కార్యకర్తలను విస్మరిస్తే ఏం జరుగుతుందో జగన్ కు రుచి చూసిన తర్వాత కానీ అస్సలు విషయం బోధపడలేదు. ఎమ్మెల్యేలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వారు కూడా కార్యకర్తలకు అండగా నిలబడలేకపోవడంతో పార్టీకి మరింత డ్యామేజీ జరిగింది.
ఈసారి అధికారంలోకి వస్తే...
అందుకే జగన్ తరచూ ఈ మధ్య సమావేశాల్లో జగన్ 2.O లో కార్యకర్తలకు పెద్దపీట వీస్తానని పదే పదే చెబుతున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చినా కార్యకర్తల చేయి తాను వదిలిపెట్టబోనని హామీ ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కార్యకర్తల ఇంటి బాట పట్టారు. ఇప్పటి వరకూ జగన్ నేతల ఇళ్లకే పరిమితమయ్యారు. వారి వివాహాలు, విషాద సమయంలో పరామర్శలకు మాత్రమే వెళుతున్నారు. కానీ జగన్ లో మార్పు వచ్చిందని చెప్పడానికి నేరుగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా కార్యకర్తలలో మరింత విశ్వాసాన్ని పెంచి వచ్చే ఎన్నికలకు మాత్రమే కాకుండా ప్రతి పార్టీ కార్యక్రమం విజయవంతం అయ్యేలా వారు కృషి చేస్తారని నమ్ముతున్నారు.
రేపు తెనాలిలో పర్యటించి...
రేపు వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.15 గంటలకు తెనాలిలోని ఐతానగర్ కుచేరుకుంటారు. ఇటీవల పోలీసు దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబీకులను పరామర్శించనున్నారు. వారికి తాము అండగా నిలుస్తామన్న భరోసా ఇవ్వనున్నారు. ఇక జూన్ 3వ తేదీన పోలీసు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెంటపాళ్ల ఉప సర్పంచ్ పోలీసు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. అలాగే గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ చర్యల ద్వారా తాను కార్యకర్తలకు అందుబాటులో ఉన్నానన్న సంకేతాలను క్యాడర్ లోకి బలంగా పంపనున్నారు.
Tags:    

Similar News