శైలజా కిరణ్ పై లుక్ అవుట్ నోటీసులు

లుక్ ఔట్ నోటీసును ఉపసంహరించుకునేలా ఏపీ సీఐడీని ఆదేశించాలని కోరుతూ శైలజ తరఫున వి.రత్నకుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2023-05-31 02:11 GMT

ఏపీ సీఐడీ ఇటీవల మార్గదర్శి ఎండీ సీహెచ్. శైలజపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే..! ఈ నోటీసులపై శైలజా కిరణ్ కోర్టుకు ఎక్కారు. తనపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులను సవాలు చేస్తూ శైలజ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శైలజా కిరణ్ ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారని.. త్వరలోనే వస్తున్నామని కూడా కోర్టుకు తెలిపారు. లుక్ ఔట్ నోటీసును ఉపసంహరించుకునేలా ఏపీ సీఐడీని ఆదేశించాలని కోరుతూ శైలజ తరఫున వి.రత్నకుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ పై అమరావతి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ కోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చినా సీఐడీ ఖాతరు చేయడం లేదన్నారు. జూన్ 6న ఇంటి వద్ద 10 గంటలకు అందుబాటులో ఉండాలంటూ పిటిషనరు సీఐడీ నోటీసు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పిటిషనర్ ఈ విచారణకు హాజరయ్యేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ సీఐడీ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసిందన్నారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్నప్పుడు విమానాశ్రయంలో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 3న హైదరాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఆదేశాలివ్వాలని కోరారు.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. ఈమేరకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నుంచి రూ.793 కోట్ల నగదును అటాచ్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. మార్గదర్శి కేసు దర్యాప్తులో ఇది కీలక పరిణామంగా చెబుతున్నారు. మార్గదర్శి కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేశారు. చిట్ ఫండ్ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి, నిధులను దారి మళ్లించారన్నది రామోజీరావు తదితరులపై ప్రధాన ఆరోపణ. చిట్స్ ద్వారా వసూలైన డబ్బును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కు బదలాయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీఐడీ రామోజీరావును ఏ-1గా, ఆయన కోడలు శైలజా కిరణ్ ను ఏ-2గా పేర్కొంది.


Tags:    

Similar News