Andhra Pradesh : ఎవరికీ పట్టదా...మంత్రులకు... ఎమ్మెల్యేలకు తేడా ఏముంది?

మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలిసింది

Update: 2025-10-10 12:26 GMT

మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలిసింది. మంత్రులు పట్టీపట్టనట్లు వ్యవహరంచడం పట్ల లోకేశ్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశం అయిన వెంటనే హడావిడిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే లోకేశ్ మాత్రం టీడీపీకి చెందిన మంత్రుల ఉదాసీన వైఖరిపట్ల సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం నిందితులందరినీ అరెస్ట్ చేసినప్పటికీ ప్రతిపక్ష వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు తగిన రీతిలో ఖండించలేకపోయారని లోకేశ్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కల్తీ మద్యం విషయంలో...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కల్తీ మద్యం సరఫరా అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ మంత్రులు సరైన రీతిలో స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరి శాఖకు సంబంధించిన వ్యవహారాన్ని వారు ఖండిస్తారనుకోవడం పొరపాటని, మంత్రులు తమ జిల్లాలకు వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్న దుష్ప్రచారాన్ని వెల్లడించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. జిల్లాలకు వెళ్లినా తమకు సంబంధం లేదని వ్యవహరించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని కూడా మంత్రులను లో్కేశ్ హెచ్చరించినట్లు తెలిసింది. ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారం వెళ్లాలంటే ఎలా? కొందరు మంత్రులను నిలదీసినట్లు సమాచారం.
అన్ని రకాల చర్యలు తీసుకున్నా...
కల్తీ మద్యం కేసులో ఉన్నది తెలుగుదేశం పార్టీ వాళ్లని తెలిసి వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, అదే సమయంలో తమ హయాంలోనే ఈ కల్తీ మద్యం బయట పడిన విషయాన్ని సమర్థవంతంగా ప్రజలకు తెలియజెప్పడంలో మంత్రులు ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుందని నారా లోకేశ్ అన్నట్లు తెలిసింది. తమకు ఎందుకులే అని పట్టీపట్టనట్లు ఉంటే ప్రభుత్వానికే కాకుండా, పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని, ప్రతిపక్ష వైసీపీ దానిని అడ్వాంటేజీగా తీసుకుని జనంలోకి బాగా తీసుకెళ్లగలిగిందని కూడా లోకేశ్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు ఎన్ని సార్లు హెచ్చరించినా ఇంకా మార్పులు లేకపోతే ఎలా అని కొందరిని నేరుగానే ప్రశ్నించారని చెబుతున్నారు. మొత్తం మీద నారా లోకేశ్ మంత్రుల వ్యవహారశైలిపై నారాజ్ అయినట్లు చెబుతున్నారు. మరొకవైపు చిత్తూరు జిల్లాటీడీపీ నేతలు కూడా స్పందించపోవడంపై నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.




Tags:    

Similar News