చిన్నారిపై చిరుత పులి దాడి
శ్రీశైలం క్షేత్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో చిన్నారుట్ల చెంచుగూడెం గ్రామంలో చిన్నారిపై చిరుతపులి దాడి చేసిన ఘటన సంచలనం కలిగించింది
శ్రీశైలం పుణ్య క్షేత్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో చిన్నారుట్ల చెంచుగూడెం గ్రామంలో చిన్నారిపై చిరుతపులి దాడి చేసిన ఘటన సంచలనం కలిగించింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న చిన్నారి పై చిరుతపులి దాడి చేసింది. సమీప అడవి నుంచి వచ్చిన చిరుత పులి తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లింది. పక్కనే ఉన్న తండ్రి గమనించి కేకలు వేసి చిరుతను వెంబడించడంతో గ్రామ శివారులో చిన్నారిని వదిలేసి వెళ్లింది. చిరుతపులి దాడిలో గాయపడిన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఏడు దశాబ్దాల నుంచి ఉంటున్నా...
సుమారు ఏడు దశాబ్దాల నుంచి చిన్నారుట్లగూడెంలో ఉంటున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని చెంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోర్నాల-శ్రీశైలం రహదారిపై వెళుతున్న ఆర్టీసీ బస్సులు, వాహనాలను నిలిపివేసి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దోర్నాల అటవీ, పోలీసుశాఖ అధికారులు వచ్చి చెంచులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. గత కొద్ది రోజులుగా శ్రీశైలం, సున్నిపెంట, బైర్లూటి, సంజీవనగర్‌తండా, మహానంది, బనకచర్ల, కోసిగి ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం పెరిగిందని అంటున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతపులులు తమ గ్రామంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.