YSRCP : అంతా వన్ సైడేనట.. వారు చెప్పేది వినవయ్యా సామీ?

వైసీపీలో నాయకత్వంపై నేతలకు ఇంకా నమ్మకం కలగడం లేదు

Update: 2025-07-05 09:00 GMT

వైసీపీలో నాయకత్వంపై నేతలకు ఇంకా నమ్మకం కలగడం లేదు. జనంలో పార్టీ పట్ల కొంత పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నా అది నిలబెట్టుకుంటారన్న నమ్మకం నేతలకు లేదు. అందుకు నాయకత్వ వైఖరి కారణం. జగన్ ఇంకా తన పాత వైఖరిని అవలంబిస్తున్నారు. కోటరీ మధ్యనే ఆయన ఇంకా కూరుకుపోయి ఉన్నారు.అనేక మంది నేతలు కోటరీపై విమర్శలు చేస్తూ బయటకు వెళ్లిపోయాని జగన్ తీరు మారలేదని అంటున్నారు. అందుకు కారణం వారిని జగన్ బలంగా నమ్మడమేనని, అంతకు మించి వారి చేతుల్లో జగన్ ఉన్నారని నేతలకు స్పష్టమయింది. అందుకే నేతలు గతంలో మాదిరిగా ఉత్సాహంగా జగన్ పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంటున్నారు.

వాస్తవ పరిస్థితులు...
జగన్ చుట్టూ ఇంకా కోటరీ చుట్టుముట్టి ఉందని, దాటిని దాటుకుని వెళ్లి వాస్తవ పరిస్థితులు చెప్పేందుకు వీలు కలగడం లేదంటున్నారు. తమ నియోజకవర్గాలు మాత్రమే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులతో పాటు నేతలపై నమోదవుతున్న కేసులు ఒకవైపు పార్టీకి దూరం చేస్తుంటే మరొక వైపు కోటరీ తో జగన్ కు, లీడర్లకు మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. పార్టీకి నాయకత్వం వహించేవారు జనంలో నిత్యం తిరిగే నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుంటుంది. కానీ జగన్ నిర్వహిస్తున్న సమావేశాలన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయన్నది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం.
సీనియర్ నేతల సలహాలు...
వైసీపీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. రాజకీయ అనుభవం ఉన్నవాళ్లున్నారు. దశాబ్దాల నుంచి రాజకీయాలను ఒడిసిపట్టిన నేతలను కూడా జగన్ ఉపయోగించుకోవడం లేదంటున్నారు. సీనియర్ నేతలు అని కూడా చూడకుండా తాను చెప్పిందే వినాలని, కోటరీ చెప్పిన మాటలనే సమావేశాల్లో జగన్ చెబుతుండటంతో నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఇంత దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, కేవలం పదకొండు సీట్లకే పరిమితమయినా దానిపై కనీసం సమీక్షలు చేయకుండా, కారణాలు అన్వేషించకుండా భవిష్యత్ లో ఏం చేయాలన్న దానిపై సీనియర్ నేతలతో చర్చింకుండా కార్యక్రమాలను ప్రకటించడం పట్ల కూడా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వ్యతిరేకతపైనే...
ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, నాలుగేళ్లలో మరింత వ్యతిరేకత పెరిగి వైసీపీ విజయం ఖాయమని జగన్ అనుకుంటున్నారే తప్పించి ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులను తెలుసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్న ధ్యాస కనిపించడం లేదని నేతలు వాపోతున్నారు. అందుకే దాదాపు ఎనభై శాతం మంది నేతలు కోటరీకి భయపడి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ, సమావేశాల్లో జగన్ చెప్పిన దానికి తలూపి వస్తున్నారని అంటున్నారు. నిజానికి గత వైసీపీ హయాంలో చేసిన తప్పులను తెలుసుకుని తిరిగి తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయమని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో అధికార పార్టీ వ్యతిరేకతపైనే జగన్ ఆధారపడి ముందుకు వెళుతున్నారంటున్నారు. అదే ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News