Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం అదేనట

కర్నూలుబస్సు దగ్దం కేసులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి

Update: 2025-10-24 11:35 GMT

కర్నూలు బస్సు దగ్దం కేసులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కర్నూలులో అగ్నిప్రమాదానికి గురైన బస్సు విషయంలో వచ్చిన ఆరోపణలకు వేమూరి కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం స్పందించింది. ఆ బస్సుకు సంబంధించిన ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌లు ఇంకా చెల్లుబాటులో ఉన్నాయని కంపెనీ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం గురించి సమాచారం అందిందని ఆయన చెప్పారు.

వర్షం పడుతున్న సమయంలో...
నిరంతర వర్షం కారణంగా ఓ బైక్‌ జారి మంటలు అంటుకున్నాయని, వేగంగా వెళ్తున్న ఆ బైక్‌ బస్సు కిందకు వెళ్లడంతో మంటలు బస్సు ప్రధాన ద్వారం వద్ద వ్యాపించాయని వివరించారు. దాంతో ప్రయాణికులు బయటకు రావడం కష్టమైందని తెలిపారు. డ్రైవర్లు కిటికీ గాజులు పగలగొట్టి కొంతమందిని కాపాడగలిగారని చెప్పారు. మొత్తం 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని, వారందరికీ ట్రావెల్స్‌ సంస్థ ద్వారా ఇన్షూరెన్స్‌ లభిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
అధికారులు మాత్రం...
అయితే భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు వ్యాఖ్యానించారు. బైక్‌ మంటల వల్లే ప్రమాదం జరిగిందన్న యాజమాన్య వాదనను అధికారులు తిరస్కరించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం, యాజమాన్య తప్పిదమే దుర్ఘటనకు కారణమని తెలిపారు. బస్సులో అగ్నిమాపక ఫోమ్‌ సీసా, అత్యవసర హ్యామర్‌ వంటి భద్రతా పరికరాలు లేకపోవడం ప్రాణనష్టానికి దారితీసిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బస్సు గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్తోందని వివరించారు. మరొకవైపు బైకర్ రాంగ్ రూట్ లో వచ్చి బస్సును ఢీకొట్టడం వల్ల కూడా ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. మొత్తం మీద అధికారుల దర్యాప్తులో కానీ అసలు వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు.
Tags:    

Similar News