Kurnool Bus Accident : సెల్ ఫోన్లు మంటల వ్యాప్తికి కారణమయ్యాయట
కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ వివరాలు వెల్లడించారు
కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ వివరాలు వెల్లడించారు. బస్సు లగేజ్ విభాగంలో ఉంచిన కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని ఆయన చెప్పారు. ఈ హ్యాండ్‌సెట్లు బెంగళూరులోని ఓ కస్టమర్‌కు పంపించడానికి ఉంచి ఉండవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని ఆయన వివరించారు. మంటల తీవ్రత వల్ల బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని చెప్పారు.
పెట్రోలు పడి మంటలు...
కరిగిపోయిన షీట్ల కింద నుంచి ఎముకలు, బూడిద కిందపడటం చూశామని వెంకటరమణ తెలిపారు. ఇంధన లీకేజీ కారణంగా ముందు భాగంలో మంటలు అంటుకున్నాయని ఆయన వివరించారు. ఎదురుగా వచ్చిన బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో దాని నుంచి చిందిన పెట్రోలు తాకిడికి వేడితో లేదా స్పార్క్‌తో మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుందని తెలిపారు. బస్సు తయారీలో ఇనుము బదులు తేలికపాటి అల్యూమినియం వాడటం వలన వాహనం బరువు తగ్గి వేగం పెరుగుతుందని, అయితే అగ్నిప్రమాద సమయంలో ఆ లోపం ప్రమాదాన్ని మరింత పెంచిందని ఆయన చెప్పారు.