Kotla Surya Prakash Reddy : కేఈ బాటలోనే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి.. సన్నిహితులకు చెప్పేసినట్లే జరుగుతుందా?
టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే ప్రయత్నం కూడా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చేయడం లేదట. దీంతో డోన్ నియోజకవర్గంలో మాత్రమే కాదు కర్నూలు జిల్లాలో కోట్ల మౌనంపై అనేక ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు వరకూ యాక్టివ్ గా తిరిగిన ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే సమయంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఒక వెలుగు వెలిగారు.
టీడీపీలో చేరి...
2024 ఎన్నికలకు ముందు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తన కుటుంబంతో కలసి టీడీపీలో చేరారు. తన తండ్రి సుదీర్ఘకాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ కు రాష్ట్రంలో పుట్టగతులు లేవని భావించిన ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని అంటారు. వైసీపీలోకి వెళ్లడం ఇష్టంలేక టీడీపీలోకివచ్చారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాకతో కర్నూలు జిల్లాలో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లయింది. అయితే దే సమయంలో తనకు శత్రువుగా భావించే కేఈ కృష్ణమూర్తి కూడా రాజకీయంగా రిటైర్ అయ్యారు. కానీ కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సీటును అయిష్టంగానే తీసుకున్నారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే, తన రాజకీయ అనుభవమంత వయస్సు లేని టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి మంత్రి కావడం ఆయనను కుదురునివ్వకుండా చేస్తుందంటున్నారు.
రాజకీయాల నుంచి...
వచ్చే ఎన్నికల నాటికి తాను కూడా రాజకీయంగా వైదొలగాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవసరమైతే తన సతీమణిని రాజకీయాల్లో కొనసాగించాలని, తాను మాత్రం రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితుల వద్ద పదే పదే ప్రస్తావిస్తున్నారట. తాను ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని కుటుంబంలోని ముఖ్యులతో పాటు సన్నిహితులకు కూడా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడికే పరిమితమయిన కోట్ల ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. రాజకీయాలు ఇక తనకు పనికి రావని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరి కోట్ల నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి.