Kesineni Nani : కేశినేని పై స్థాయిలో నేతలకు టచ్ లోకి వెళ్లినట్లుందిగా?

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లుంది.

Update: 2025-11-22 08:01 GMT

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లుంది. తన సోదరుడు కేశినేని శివనాధ్ పై ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలతో ఆయన మరొకసారి రాజకీయంగా తానేంటో చూపాలనుకుంటున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. అయితే కేశినేని నాని గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినప్పటికీ, ఆయన ఇప్పుడు మనసు మార్చుకుని బీజేపీ లో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. పదేళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేశినేనినాని ఢిల్లీలో తనకున్న పరిచయాలతో త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

వరసగా రెండు సార్లు గెలిచి...
విజయవాడ పార్లమెంటుకు 2024, 2019 ఎన్నికల్లో గెలిచిన కేశినేని నాని ఏనాడూ పెద్దగా విమర్శలు ఎదుర్కొనలేదు. ఇప్పుడు తన సోదరుడితో పోల్చుకుంటే కేశినేనినాని బెటర్ అన్న పేరును బెజవాడ ప్రాంతంలో తెచ్చుకున్నారు.దీంతో కేశినేని నాని మరోసారి విజయవాడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల బీజేపీ కేంద్ర నాయకత్వంలోకి టచ్ లోకి వెళ్లిన కేశినేని నాని హస్తిన కు వెళ్లి పార్టీ కండువా కప్పుకోవాలని సిద్ధమవుతున్నారని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే వచ్చేఏడాది ఆరంభంలోనే ఆయన కమలం తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని చెబుతన్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులకు కూడా ఈ సమాచారం చెప్పినట్లు తెలిసింది.
త్వరలో నియోజకవర్గాల పర్యటనలు...
విజయవాడ అంటే ప్రేమ అని పిచ్చి అని కేశినేని నాని గతంలో ఒక సందర్భంలో తెలిపారు. విజయవాడ అంటే ప్రేమతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సేవ చేయడానికి ముందుంటానని తెలిపారు. అయితే సేవ చేయాలంటే రాజకీయాలు అవసరమని గుర్తించిన కేశినేని నాని త్వరలోనే బీజేపీ జెండా పట్టుకుని తిరిగే అవకాశాలున్నాయంటున్నారు. కేశినేని నాని రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వాలంటూ ఆయన సన్నిహితులు కూడా వత్తిడి తెస్తున్నారు. అంతకు ముందుగానే కేశినేని నాని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి తన అనుచరులును, అభిమానులను కలుసుకుని సమావేశాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. మొత్తం మీద కేశినేని తిరిగి యాక్టివ్ అవుతానని చెబుతుండటంతో కేశినేని అనుచరుల్లో పొలిటికల్ కిక్కు వచ్చిందట.


Tags:    

Similar News