Kamineni Srinivas : కామినేనీ... ఏదో అవుతుందనుకుంటే.. ఏదో అయిపోతున్నట్లుందిగా?
కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు తత్వం బోధపడింది. ఆయన తాను ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిపోయింది.
కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు తత్వం బోధపడింది. ఆయన తాను ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిపోయింది. చివరకు తన వ్యాఖ్యలు రాష్ట్రంలో కూటమిలో చిచ్చు రేపేందుకు దోహదపడ్డాయని భావించిన కామినేని శ్రీనివాస్ తన తప్పును తెలుసుకున్నారు. ఈరోజు శాసనసభలో జీరో అవర్ లో ఇటీవల తన సభలో ప్రస్తావించిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు. కామినేని శ్రీనివాస్ జగన్ యాటిట్యూడ్ ను తప్పుపట్టేందుకు చిరంజీవిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తిరిగి తనకే రివర్స్ లోకి రావడంతో ఆయన అసెంబ్లీ రికార్డుల నుంచి కూడా తొలగించమని చెప్పడంతో ఆయనకు పార్టీ నాయకత్వం నుంచి కొంత క్లాస్ పీకినట్లు అర్ధమవుతుంది
సీనియర్ నేత అయినా...
కామినేని శ్రీనివాస్ సీనియర్ నేత. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పైనే గెలుపొందారు. పార్టీ అయితే, బీజేపీనే కానీ, ఆయన మనసు మాత్రం టీడీపీపైనే ఉంది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఆయనపై పన్నెత్తు మాట కూడా అనలేని నైజం ఆయన సొంతం.అలాగే కామినేని శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కైకలూరు నుంచి ఎనభై వసంతాల వయసులో ఆయన మరోసారి మంత్రి పదవి కోరుకోవడంలో భాగంగా చిరంజీవిని పొగుడుతూ, జగన్ ను తిట్టాలని ఆయన అసెంబ్లీలో అనవసరమైన వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు బలంగా వినిపించాయి. అసలు శాంతి భద్రతల సమస్యలపై చర్చ సందర్భంగా సినిమా వాళ్ల గొడవ ఎందుకు తెచ్చావు సామీ అని అప్పుడే అనేక మంది అన్నారు.
ఏదో అనబోతే.. ఏదో జరగడంతో...
కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతూ, జగన్ యాటిట్యూడ్ ను బయటపెట్టాలని చేసిన ప్రయత్నం వికటించింది. నందమూరి బాలకృష్ణ దీనిపై జగన్ పైనా, చిరంజీవిపైనా హార్ష్ కామెంట్స్ అసెంబ్లీ లో చేయడం వివాదంగా మారింది. అదే రోజు దాదాపు పదిహేడు వేలమంది డీఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చిన వార్త కనిపించలేదు. మీడియాలో ఈ వివాదమే హైలెట్ కావడమే కాకుండా చిరంజీవిని దూషించడంతో కాపు సామాజికవర్గంలోనూ, మెగా ఫ్యాన్స్ లోనూ ఆగ్రహావేశాలు కనిపించాయి. దీంతో మళ్లీ సరిదిద్దుకునే ప్రయత్నం తానే చేయాలని భావించిన కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. అంతవరకూ బాగానే ఉన్నా.. కామినేని శ్రీనివాస్ అన్యాపదేశంగానే ఉన్నా.. అది కూటమిలో తుపాను గా మారడంతో దిద్దుకునే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది.