Kadapa : కడప రెడ్డమ్మ.. కన్నెర్ర చేస్తే మసి కావాల్సిందేనా?
కడప తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలే రోడ్డుకెక్కారు.
కడప తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలే రోడ్డుకెక్కారు. ఇది కడపలో పార్టీ పరిస్థితిని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో గెలిచామని, ఈసారి పదికి పది గెలవాలన్న ఉద్దేశ్యంతో అక్కడే మహానాడును నిర్వహించారు. కానీ కడప జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. అందులో కడప ఎమ్మెల్యే మాధవి ఒకరు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన మాధవి రెడ్డి సొంత క్యాడర్ ను పట్టించుకోవడం లేదు. తన వల్లనే గెలుపు సాధించానన్న విజయ "గర్వం" ఊగిపోతుండటం కడప నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.
సొంత పార్టీ నేతలే...
దూకుడుగా వెళితే ప్రజలు ఆదరిస్తారన్నది కడప రెడ్డమ్మ నమ్మకం కావచ్చు. కానీ అదే దూకుడు మాధవికి బూమ్ రాంగ్ అయ్యేటట్లుంది. తన విజయం కోసం పనిచేసిన నేతలను, కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చిన నేతలను పక్కన పెట్టుకోవడం క్యాడర్ కు కంటగింపుగా మారింది. కడప కార్పొరేషన్ లో సీటుతో మొదలయిన మాధవి రెడ్డి వివాదం, తర్వాత ఆగస్టు పదిహేనో తేదీ నాడు వేదికపై జాయింట్ కలెక్టర్ తో కుర్చీ వివాదం వంటివి పక్కన పెడితే అసలు కార్యకర్తలను కూడా కేర్ చేయకపోవడం.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని వ్యవహరిస్తున్న తీరుతో కడప నియోజకవర్గం టీడీపీ నేతలు మాత్రం కంగుతిన్నారు. దీంతో వారు మరొక మార్గాన్ని ఎంచుకున్నారు.
మంచి బుద్ధిని ప్రసాదించాలని...
ఎమ్మెల్యే మాధవి రెడ్డి భర్త శ్రీనివాసులు రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో ఇక నేతలు ఆయనకు తమ బాధలను మొరపెట్టుకుని ఫలితం లేదని భావించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అధినాయకత్వంతో ఫిర్యాదు చేయకుండా మాధవికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దేవుని గడపలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రాన్ని అందించారు. అంతటితో ఆగకుండా కడప నియోజకవర్గం నేతలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి కమలాపురం టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డని కలిసి తమ గోడును వినిపించుకున్నారు. మాధవి రెడ్డి ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, వేరే పార్టీ నుంచి చేరిన వాళ్లకు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని హామీ ఇవ్వడమే ఈ రగడకు కారణమని అంటున్నారు. మరి మాధవిరెడ్డిని టీడీపీ నాయకత్వం కంట్రోల్ చేయకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీ కోల్పోయే మొదటి సీటు కడప అవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు మందలించి వదిలేస్తారా? లేదా? ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా? అన్నది చూడాలి.