Summer Effect : భానుడు భగ్గుమంటున్నాడు.. సెగ కక్కుతున్న సూరీడు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం ఏడు గంటల నుంచి భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడి పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చినెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగి పోవడంతో రానున్న కాలంలో మరెంతగా పెరుగుతాయన్న ఆందోళన ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ గరిష్టంగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. దీంతో ప్రజలు ఉదయం వేళబయటకు రావడానికే భయపడిపోతున్నారు. ప్రధానంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్రలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నలభై డిగ్రీలు దాటేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణలోనూ వేసవి తీవ్రత...
తెలంగాణలోనూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్రత మొదలయ్యేది. ఈసారి తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్,వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 35 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న కాలంలో సాధారణంకంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటి వేళ బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.