Pawan Kalyan : పిఠాపురం వేదికగా పవన్ ప్రసంగంలో ఎవరిని టార్గెట్ చేయనున్నారంటే?

నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దాదాపు ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా

Update: 2025-03-14 06:30 GMT

నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దాదాపు ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు వైసీపీ పై ఖచ్చితంగా విమర్శలుంటాయి. ఎందుకంటే ఇటీవల వైసీపీ అధినేత జగన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జగన్ పై గట్టిగానే స్పందిస్తారని చెబుతున్నారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను, అవినీతిని ఎండగడుతూనే తన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల పార్టీ ప్రస్థానంలో తను పడిన కష్టాన్ని కూడా వివరించనున్నారు.

కీలక ప్రకటన...
కానీ ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేయబోతున్నారని కూడా చెబుతున్నారు. రానున్న కాలంలో కార్యకర్తలకు, నేతలకు పదవుల పంపిణీలో న్యాయం జరుగుతుందన్న భరోసాను ఈ సమావేశం ద్వారా ఇవ్వనున్నారని సమాచారం. అలాగే కార్యకర్తలకు, నేతలకు కూడా హెచ్చరికలు వేదికపై నుంచే జారీ చేయనున్నారు. వివాదాల్లో తలదూర్చడం కానీ, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం కానీ, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి వాటిని తాను క్షమించబోనని కూడా వార్నింగ్ ఇవ్వనున్నారు. అలాంటి వారు ఎంతటి వారైనా పార్టీ నుంచి బయటకు పంపుతామని కూడా గట్టిగా పవన్ కల్యాణ్ హెచ్చరించనున్నారని తెలిసింది.
తమకున్న పరిమితులను...
మరొక వైపు కూటమి ప్రభుత్వంలో తమకు ఉన్న పరిమితులను కూడా పవన్ కల్యాణ్ వివరించే అవకాశముంది. నిధులు లేమితో కొంత ఇబ్బందులు పడుతున్నామని, కొంత సమయం తీసుకుని ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని, దశలవారీగా వాటిని ప్రజలకు చేరువయ్యేలా చేస్తామని ఐదు లక్షల మంది సమక్షంలో పవన్ కల్యాణ్ చెప్పనున్నారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కొంత పరిస్థితి అనుకూలంగా మారిందని, లేకుంటే మరింత కష్టాలు పడే వారమని కూడా చెప్పనున్నారు. దీంతో పాటు అనేక రాజకీయ పరిణామాలను ఆయన ప్రస్తావించే అవకాశాలున్నాయని జనసేన కీలక నేత ఒకరు తెలిపారు. పవన్ కల్యాణ్ దాదాపు గంటన్నర సేపు ప్రసంగించనున్నారని తెలిసింది. 


Tags:    

Similar News