Andhra Pradesh : మీ ముగ్గురు ఒకటయితే సరిపోతుందా జానీ.. కిందోళ్లు కావద్దూ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య తరచూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. కూటమిని ఎవరూ విడదీయలేరంటున్నారు.

Update: 2025-06-27 06:33 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య తరచూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. కూటమిని ఎవరూ విడదీయలేరంటున్నారు. తమ మిత్రత్వాన్ని చెడగొట్టే పనిచేయలేరని అంటున్నారు. కరెక్టే.. టీడీపీ, జనసేన, బీజేపీ 2029 ఎన్నికల్లో కూడా కలసి పనిచేస్తాయి. అందులో ఎవరికీ పెద్దగా సందేహం లేదు. ఎందుకంటే 2024 లో జరిగిన ఎన్నికల్లోనే వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయంటే వచ్చే ఎన్నికల్లో విడిపోతే పడిపోక తప్పదని ముగ్గురికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోదీ కావచ్చు.. పవన్ కల్యాణ్ అనుకోవచ్చు. తాము ముగ్గురం కలసి ఉంటే విజయం మరొసారి ఖాయమన్న విశ్వాసం ముగ్గురిలోనూ కనపడుతుంది. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ మరొకసారి కలిసే పోటీ చేస్తామని చెబుతుండం, జగన్ అధికారంలోకి రానివ్వబోమని చెబుతుండటాన్ని అర్థం చేసుకోవచ్చు.

స్టేజీ మీద చెప్పిన డైలాగులు...
అయితే ఇది వింటానికి చాలా బాగుంటుంది. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే సినిమాల్లో ఆ డైలాగులు బాగుంటాయి. బయట అంటే తొక్కి నారతీస్తాం అని హెచ్చరించారు. అలాగే స్టేజీ పై మాట్లాడిన మాటలు బాగానే ఉంటాయి. విజయం తమదేనని, కూటమి విడిపోదని చెప్పుకోవచ్చు. కానీ వేదిక కింద పరిస్థితి ఏంటన్నది పవన్ కల్యాణ్ కు అర్థమవుతుందా? అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. తన సొంత పార్టీ నేతలపైనే అనుమానంతో పవన్ కల్యాణ్ ఒక కన్నువేసి ఉంచడమే కాకుండా సర్వేలు కూడా చేయించుకోవడం చూస్తుంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎంత మాత్రం ఉందో తెలుసుకునే ప్రయత్నం అయినా ఉండాలి. లేకుంటే వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న తపన కావచ్చు.
వారు కాదు కదా?
ఇదంతా పక్కన పెడితే... మోదీ.. పవన్... చంద్రబాబు ఈ ముగ్గురు కలసి నడుస్తారు. పోటీ చేస్తారు కూడా. అందులో వివాదమే లేదు. కానీ కిందిస్థాయి క్యాడర్ కదా కలసి నడవాల్సింది. సామాజికవర్గాలు కదా కలసి పనిచేయాల్సింది. ద్వితీయ శ్రేణి నేతలు కదా కట్టడిగా ఉండాల్సింది. కానీ ప్రస్తుతం ఏడాదిలోనే కూటమి పార్టీల్లో మూడింటిలో క్యాడర్ సంతృప్తిగా లేదు. కొద్దో గొప్పో కొంత శాతం ఎక్కువగా క్యాడర్ సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలోనే. ఎందుకంటే పనులు జరుగుతున్నవి వారికే. కాంట్రాక్టులు దక్కుతున్నవి వారికే. చిన్నచిన్న పనులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా అత్యధికంగా చేజిక్కించుకుంటున్నది తెలుగు తమ్ముళ్లే. అందుకే తెలుగుదేశం పార్టీలో యాభై శాతం క్యాడర్ సంతృప్తి కరంగానే ఉంది.
అన్ని నియోజకవర్గాల్లో....
ఇక జనసేన విషయానికి వస్తే తాము గెలిచిన 21 నియోజకవర్గాల్లో. గెలిపించిన 154 నియోజకవర్గాల్లో సంతృప్తికరంగా లేరు. అసలు నిజం చెప్పాలంటే జనసేనఎమ్మెల్యలు ఉన్న చోట వారికంటే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులకే పనులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని లేదు. దాదాపు 175 నియోజకవర్గాల్లో మూడు పార్టీల క్యాడర్ మధ్య సఖ్యత లేదు. కలుపుకుని పోవాలని ప్రయత్నించే నేత లేరు. అలాగే ద్వితీయ శ్రేణి నేతల్లోనూ కలసి ఉందామన్నధ్యాస లేదు. ఒకరిపై ఒకరు కసి, పగ పెంచుకునే స్థాయికి వచ్చారు. ఏడాదిలోనే ఇలా ఉంటే ఇక మీ ముగ్గురు పైన కలసి లాభమేముందయ్యా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి జనసేనాని పైన.


Tags:    

Similar News