నాదెండ్లది ఆ నియోజకవర్గమే.. మాట ఇచ్చేసిన జనసేనాని

తెనాలిలో జనసేన పార్టీ నిర్వహించిన నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశంలో జనసేనాని

Update: 2023-08-02 05:51 GMT

తెనాలిలో జనసేన పార్టీ నిర్వహించిన నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని తెనాలి ప్రజలకు జనసేనాని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో తెనాలిలో ఎగిరేది జనసేన జెండానేనని అన్నారు. జనసేన నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామని, అద్భుతమైన పనులు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి జనసేన వైపు చూస్తున్నారని, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అని ప్రజలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో నాదెండ్ల మనోహర్ అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరని చెప్పారు.

నేను బాగుండాలి.. నేనే బాగుపడాలి.. అన్నది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అని.. ఈ విషయం తాను ఎప్పుడో గుర్తించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వం ప్రజలపై అనవసరమైన పన్నులు వేస్తోందని.. చివరకు చెత్తపైన కూడా పన్ను వేస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పన్నులతో ప్రజల నడ్డి విరుస్తూ సేకరించిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామంటే ఎలాగని జనసేనాని నిలదీశారు. తండ్రి లేని పిల్లాడని మాత్రమే ప్రజలు జగన్ ను సీఎం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏడాది పాటు పాదయాత్ర చేయడంతో కూడా జగన్ పై జనాలకు జాలి కలిగిందని.. ఫలితంగానే అతడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పారు.


Tags:    

Similar News