Pawan Kalyan : పవన్ సర్వేలో అదే తేలిందా? ఇలాగయితే కష్టమేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే నెల నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు

Update: 2025-07-24 08:58 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే నెల నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. పదవులపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశముంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల విషయంలోనూ జనసేనాని కొంత కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇక పార్టీకి 2014 నాటి హైప్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారట. ఇందుకోసం అనేక నియోజకవర్గాలలో సర్వేలు కూడా చేయిస్తున్నారు. తమకు పట్టున్న జిల్లాల్లో కొంత పార్టీని మరింత బలోపేతం చేసిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు పార్టీని విస్తరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తన ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలను...
అవసరమైతే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడానికి కూడా సిద్ధమయినట్లు కనిపిస్తుంది. ఇటీవల మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కూటమిలో అన్ని పార్టీలు సమన్వయంతో కలసి పనిచేస్తున్నాయని చెప్పిన పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి భూములు అదనంగా సేకరించే విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు. రాజధానికి అదనపు భూమిని ఇవ్వడంలో బలవంతం ఏమీ లేదని, ఇష్టపూర్వకంగా ఇస్తేనే ప్రభుత్వం తీసుకుంటుందని, బలవంతంగా మాత్రం తీసుకోదని ప్రభుత్వం తరుపున చెప్పారంటే ఆయన అదనపు భూ సేకరణను వ్యతిరేకించినట్లే కనపడుతుంది. రాజధాని రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని ఆయన గమనించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది.
ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను...
జనసేన ఎమ్మెల్యేలతో పాటు కూటమి పార్టీల్లోని ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కూడా ఆయన పసిగట్టినట్లు సమాచారం. స్థానికంగా సమస్యలను పరిష్కరించలేకపోతుండటంతో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. జనసేనకు చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేల్లో దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లు సర్వే ద్వారా తేలడంతో వారిని పిలిచి క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి రానున్న నాలుగేళ్ల పాటు కష్టపడి పనిచేసి మంచి మార్కులు తెచ్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవన్న హెచ్చరికలు కూడా పవన్ జారీ చేసే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చే అవకాశముంది.


Tags:    

Similar News