YSRCP : జగన్ కు చంద్రబాబు అలా చెక్ పెడుతున్నారా? వైసీపీ మైలేజీ పెరగకుండా?
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉండటం మంచిదేమో.
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉండటం మంచిదేమో.. ఎందుకంటే ఏ సమస్యపై స్పందించినా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపై స్పందిస్తున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీలు చేసే విమర్శలు పెద్దగా కేర్ చేయదు. గతంలో చంద్రబాబు, జగన్ లు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ అదే చేసేవారు. విపక్ష విమర్శలను లెక్కపెట్టేవారు కాదు. అది విపక్షానికి ప్లస్ గా మారేది. అధికారంలో ఉన్న పార్టీకి మైనస్ అయ్యేది. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు విపక్ష వైసీపీ లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన నిర్ణయం తీసుకోవడమే కాకుండా వెనువెంటనే ఆదేశాలు జారీ చేస్తుండటంతో వైసీపీకి రావాల్సిన మైలేజీ రాకుండా పోతుంది.
రైతాంగ సమస్యలపై...
ఉదాహరణకు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ జగన్ విమర్శించి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. వెంటనే కేంద్రమంత్రిని పిలిపించి పొగాకు బోర్డు తో మాట్లాడి ధరను కొంత పెంచేలా చేశారు. ఇక చిత్తూరు మామిడి విషయంలోనూ అదే జరిగింది. అలాగే పొగాకుకు తగిన గిట్టుబాటు ధరలేదని పొదిలికి జగన్ వెళితే పొగాకుకు కూడా అప్పటి వరకూ వస్తున్న దానికంటే కొంత మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మామిడిపండ్ల రైతులను పరామర్శించడానికి బంగారుపాళ్యం జగన్ వెళ్లడానికి ముందే ధరలు పెంచేశారు చంద్రబాబు. ఇలా అన్ని రకాలుగా రైతుల విషయంలో జగన్ అక్కడకు వెళ్లి పరామర్శ కు దిగక ముందే చంద్రబాబు చర్యలు తీసుకుంటుండటంతో భారీగా రావాల్సిన మైలేజీ రాకుండా పోతుంది.
యూరియా కొరతపై కూడా...
ఇక తాజాగా యూరియా కొరతపై వైసీపీ ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపు నిచ్చింది. వెనువెంటనే యూరియా తగ్గించి వాడితే బస్తాకు తమ ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని ప్రకటించి చంద్రబాబు నాయుడు వైసీపీని డిఫెన్స్ లో నెట్టేశారు. ఇక దీంతో వైసీపీ ప్రభుత్వ మెడికల్ కళాశాలవైపునకు మళ్లింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చేయవద్దని ఆందోళనలకు దిగాలని వైసీపీ నిర్ణయించింది. అయితే సామాన్య ప్రజలకు ఈ అంశంతో నేరుగా కనెక్షన్ లేకపోవడంతో తాము పీపీపీ పద్ధతిలోనే వెళుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇలా వైసీపీ అధినేత జగన్ ఏ అంశాన్ని భుజానకెత్తుకున్నా ఆలోపే రివర్స్ లో చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వైసీపీకి రావాల్సిన మైలేజీ రావడం లేదన్న చర్చ వైసీపీలో ఎక్కువగా జరుగుతుంది.